Justice Sanjiv Khanna: మార్నింగ్ వాక్ అలవాటు వదులుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఎందుకంటే..!
- భద్రతతో వాకింగ్ చేయాలనే సూచనను తిరస్కరించిన జస్టిస్
- అలవాటును వదులుకోవాలని నిర్ణయం
- సీజేఐగా నోటిఫికేషన్ రాక ముందు ఒంటరిగా కిలోమీటర్ల మేర మార్నింగ్ వాకింగ్ చేసే అలవాటు
జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించడానికి ముందే తనకు ఎంతో ఇష్టమైన ఒక అలవాటును ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ప్రతి రోజూ ఉదయం ఎంతో ఇష్టంగా కొన్ని కిలోమీటర్ల మేర మార్నింగ్ వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు. తనను ఎవరూ గుర్తుపట్టరనే నమ్మకంతో ఢిల్లీలోని లోధి గార్డెన్ ప్రాంతం, తన ఇంటి చుట్టుపక్కల ఒంటరిగా వాకింగ్ చేస్తుండేవారు. అయితే గత నెలలో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. భద్రతా సిబ్బందితో మార్నింగ్ వాక్‌కు వెళ్లాలని భద్రతా అధికారులు ఆయనకు సూచన చేశారు. అయితే చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడే జస్టిస్ సంజీవ్ ఖన్నా మార్నింగ్ వాక్‌కు వెంట సెక్యూరిటీని తీసుకెళ్లడం ఇష్టంలేదని తిరస్కరించారు. ఆ అలవాటునే పూర్తిగా మానేయాలని ఆయన నిర్ణయించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుంచి లా డిగ్రీ పొందారు. ఢిల్లీలో పెరిగిన ఆయనకు నగరంలోని ప్రతి మూల గురించి బాగా అవగాహన ఉంది. ఆయన ఇప్పటికీ తన స్కూలు, కాలేజీ, క్యాంపస్ లా సెంటర్ స్నేహితులతో టచ్‌లో ఉన్నారని, వారి ఇళ్లకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారని సంజీవ్ ఖన్నా సన్నిహితులు తెలిపారు.
జస్టిస్ ఖన్నా పెద్దగా మారలేదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి ఇప్పటికీ సాదాసీదాగా, ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు. కెమెరాలకు, ప్రచారానికి దూరంగా ఉంటారని ఒక స్నేహితుడు చెప్పారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 6 నెలలు కొనసాగుతారు. మే 13, 2025న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.