SA vs IND: ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టిన టీమిండియా.. తొలి టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు
- డర్బన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20
- 61 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా
- సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ (50 బంతుల్లో 107 రన్స్)
- తలో 3 వికెట్లతో రాణించిన వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్
డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌లో ఆ తర్వాత బౌలింగ్‌లో భారత ప్లేయర్లు రెచ్చిపోయారు. దీంతో ఆతిథ్య జట్టును సూర్యకుమార్ యాదవ్ సేన 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 141 రన్స్‌కే ఆలౌట్ అయింది.
సఫారీ బ్యాటర్లలో క్లాసెన్ 25, కోట్జీ 23, ర్యాన్ 21 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. మొదటి నుంచే భారత బౌలర్లు విరుచుకుపడడంతో 87 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ టార్గెట్ ఛేదనవైపు సాగలేదు. చివరికి 17.4 ఓవర్లలో 141 పరుగులకే చాప చుట్టేసింది. భారత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ సఫారీలను బెంబేలెత్తించారు. ఇద్దరు చెరో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును కుప్పకూల్చారు. పేసర్లు అవేశ్ ఖాన్ 2, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో శతకం బాదాడు. శాంసన్ కేవలం 50 బంతుల్లోనే 107 పరుగులు చేయడం విశేషం. సంజూ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటే అతని ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 33, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేశారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 7 రన్స్‌కే అవుటై మరోసారి నిరాశపరిచాడు. చివర్లో టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ మిస్ అయింది. చివరికి భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 3 వికెట్లు తీయగా... మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ పడొట్టారు. సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.