Revanth Reddy: బుల్డోజర్‌కు అడ్డొస్తామంటే తొక్కిస్తాం... ఎవరు అడ్డొస్తారో రండి: రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy warns opposition parties

  • ప్రజలు గెలిపించారు..  వారికి  మంచి చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న సీఎం
  • ఎవరో గెలిపిస్తే కుర్చీలో కూర్చోలేదు... ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వచ్చామని వ్యాఖ్య
  • బిడ్డ జైలుకు వెళితే కేసీఆర్‌కు దుఃఖం వచ్చిందని వ్యాఖ్య
  • మూసీ ప్రజల ఇబ్బందులు పట్టవా? అని నిలదీత

మూసీ పునరుజ్జీవం చేస్తుంటే బుల్డోజర్‌కు అడ్డొస్తామంటే తొక్కిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పునరుజ్జీవ యాత్ర అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... బుల్డోజర్‌కు అడ్డుపడతామని కొంతమంది చెబుతున్నారని... అలా వచ్చేవారు ఎవరో ముందుకు రావాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుల్డోజర్ ఎక్కిస్తామని.. ఆయనతోనే తొక్కిస్తామని... ఎవరు వస్తారో రావాలన్నారు.

ఎవరు అడ్డువచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. తమను ప్రజలే గెలిపించారని... కాబట్టి ఈ ప్రజల కోసం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎవరో ఇస్తే మేం కుర్చీలో కూర్చోలేదు... ప్రజలు గెలిపిస్తే ఈ పదవిలోకి వచ్చామన్నారు.

బిడ్డ మూడు నెలలు జైల్లో ఉంటే కేసీఆర్‌కు దుఃఖం వచ్చింది

నీ బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే కేసీఆర్‌కు దుఃఖం వచ్చిందని... మరి నల్గొండలో ఏళ్ళుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎంత దుఃఖం రావాలన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు బిల్లా-రంగాల వైపు ఉంటారా? ప్రజల కోసం పని చేస్తున్న తమవైపు ఉంటారా? చర్చ చేయాలన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలను దోచుకోవడమే తెలుసునని ఆరోపించారు.

వాడపల్లి నుంచి పాదయాత్రకు సిద్ధంగా ఉండండి

2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు లక్షలాదిమందితో పాదయాత్ర చేస్తానని ప్రతిపక్షాలు కలిసి రావాలని సవాల్ చేశారు. వాడపల్లి నుంచి పాదయాత్ర చేయాలన్న హరీశ్ రావు సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని సీఎం అన్నారు. అందుకే జనవరి మొదటివారంలో తాను చేసే యాత్రకు బిల్లా, రంగాలు రావాలన్నారు.

మూసీ ప్రక్షాళన వద్దంటే ప్రజలు వారి నడుంకు రాయి కట్టి నీటిలో ముంచుతారని మండిపడ్డారు. జనవరి మొదటి వారంలో యాత్రకు సిద్ధంగా ఉండాలని హరీశ్ రావు సహా విపక్షాలకు సూచించారు. నేటి యాత్ర ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా జనవరిలో ఉందన్నారు. నదులను అనుసంధానం చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

  • Loading...

More Telugu News