Amit Shah: శివాజీ పుట్టిన గడ్డ మీది నుంచి చెబుతున్నా... ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తి లేదు: అమిత్ షా

Article 370 Will Never Be Revived says Amit Shah

  • నాలుగు తరాలు వచ్చినా ఆర్టికల్ 370ని తిరిగి తెచ్చే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
  • కశ్మీర్ ఇండియాలో బాగం కాదు అనేలా ఆర్టికల్ 370 ఉందన్న అమిత్ షా
  • ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొందని వ్యాఖ్య

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370 అంశంపై జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు అధికార ఎన్సీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తోపులాట జరిగింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం గందరగోళం మధ్యే అసెంబ్లీలో ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమిత్ షా స్పందించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్ షా మాట్లాడుతూ... నేను శివాజీ పుట్టిన మహారాష్ట్ర గడ్డమీది నుంచి చెబుతున్నాను... నాలుగు తరాలు వచ్చినా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువచ్చే ప్రసక్తి లేదన్నారు. కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అనేలా ఆర్టికల్ 370 ఉందని మండిపడ్డారు.

ఆర్టికల్ 370 రద్దు తమ ప్రభుత్వ ఘనవిజయం అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు జమ్ము కశ్మీర్ అభివృద్ధికి దోహదపడిందన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపడటానికి దారి తీసిందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొందన్నారు. వేర్పాటువాద పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడంపై ఆయన నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News