Mohan Lal: 'అమ్మ'లో ఆఫీస్‌బాయ్‌గా కూడా చేయను: మోహన్ లాల్
- మాలీవుడ్‌లో చర్చనీయాంశమైన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్
- ఈ నేపథ్యంలోనే 'అమ్మ' అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రిజైన్
- మళ్లీ ఆయనే 'అమ్మ' అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని పుకార్లు
- తనకు అలాంటి ఉద్దేశం లేదంటూ సీనియర్ నటుడి వివరణ
మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (ఏఎంఏఏ-అమ్మ) అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు మోహన్ లాల్ రిజైన్ చేశారు.
ఈ క్రమంలో మళ్లీ ఆయనే 'అమ్మ' అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిపై తాజాగా ఈ కంప్లీట్ స్టార్ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. 'అమ్మ'లో కనీసం ఆఫీస్ బాయ్ గా కూడా పని చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. హేమ కమిటీ రిపోర్టులో బయటపడ్డ విషయాలు తనను నివ్వెరపోయేలా చేశాయన్నారు. అందుకే మరోసారి ఆ అసోసియేషన్‌లో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించబోనని వెల్లడించారు.
"మేము అసోసియేషన్‌కు సంబంధించిన పదవులకు రాజీనామా చేయడానికి గల కారణాలు చెప్పాలని చాలా మంది అడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీదే. ఆ రిపోర్టులో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి. నివేదికలో వెలుగులోకి వచ్చిన విషయాల పట్ల ప్రతి ఒక్కరూ 'అమ్మ'నే ప్రశ్నించారు" అని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.