Aghori: యోగి ప్రభాకర్ సూచనతో దిగొచ్చిన మహిళా అఘోరి
- ఎర్రటి వస్త్రం ధరించి కాళహస్తి ఆలయానికి రాక
- దర్శనం కల్పించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది
- మధ్యాహ్నం ఆలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన వైనం
శ్రీకాళహస్తి ఆలయం వద్ద మహిళా అఘోరి సృష్టించిన ఉద్రిక్తతకు తెరపడింది. నగ్నంగానే ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని పట్టుబట్టిన మహిళా అఘోరి ఎట్టకేలకు దిగొచ్చింది. విశాఖ నాగ క్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ సూచనతో వస్త్రాలు ధరించింది. దీంతో గురువారం రాత్రి ఆలయ సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తుతో అఘోరికి స్వామి వారి దర్శనం చేయించారు. అంతకుముందు ఆలయం ఎదుట మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. నగ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా అఘోరిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళా అఘోరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
కాళహస్తి పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు విశాఖ నాగ క్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ ను ఆశ్రయించారు. యోగి ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా మహిళా అఘోరితో మాట్లాడారు. వస్త్రాలు ధరించాలని సూచించడంతో మహిళా అఘోరి అంగీకరించారు. రాత్రి పూట ఎర్రటి వస్త్రం ధరించి వచ్చిన మహిళా అఘోరిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది నేరుగా స్వామి వారి దర్శనానికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై కాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి స్పందిస్తూ.. ఆలయ సంప్రదాయాల ప్రకారం, సంప్రదాయ దుస్తులతో ఎవరైనా వచ్చి స్వామి వారిని దర్శించుకోవచ్చని చెప్పారు.