Chandrababu: దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం .. కీలక ప్రకటన

district as unit for sc reservation categorization in ap

  • ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
  • అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడి
  • జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన సీఎం

కూటమి పార్టీ దళిత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలుపై కీలక నిర్ణయాన్ని తెలియజేశారు. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోనే నివేదిక అందేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతం ఇచ్చేలా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు సూచనలు చేయగా, వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చామని, టీడీపీయే మొదటి నుంచి దళితులకు అండగా ఉందని సీఎం అన్నారు. 

దళితుల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిద్దామని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకు గానూ 27 స్థానాల్లో కూటమి అభ్యర్ధులను ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిజం చేస్తామని తెలిపారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా.. మరింత కాలం ఎమ్మెల్యేగా ఉంటారా? అనే విషయం మీ చేతుల్లో కూడా ఉందంటూ సీఎం చలోక్తి విసిరారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు తరచు దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ఈ సందర్భంగా సీఎం నిర్ణయించారు. 

  • Loading...

More Telugu News