shiv nadar: దాతృత్వంలో ఈయన తర్వాతే ఎవరైనా!
- మరోసారి తన దొడ్డ మనసును చాటుకున్న హెచ్‌సీఎల్ టెక్ ఫౌండర్ శివ్ నాడార్
- ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో వరుసగా మూడోసారి ప్రధమ స్థానంలో నిలిచిన శివ్ నాడార్
- రూ.154 కోట్లు విరాళాలుగా అందించి మహిళల్లో ప్రధమ స్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకరి భార్య రోహిణి నిలేకరి
ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరోసారి తన దొడ్డ మనసును చాటుకున్నారు. ఏడాది కాలంలో ఆయన దాతృత్వ కార్యక్రమాలకు రూ.2,153 కోట్లు ఖర్చు చేసి మరోసారి దేశంలో మొదటి స్థానంలో నిలిచారు.
వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, సంస్థలు తమ తమ ఆదాయంలో కొంత మేర ఛారిటీస్ కు (సేవా కార్యక్రమాలకు) విరాళాలుగా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. గత ఏడేళ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలు ఇచ్చిన దాతల్లో శివ్ నాడార్ ప్రధమ స్థానంలో నిలిచారు.
ఇక మహిళల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకరి భార్య రోహిణి నిలేకరి మొదటి స్థానంలో నిలిచారు. ఆమె ఫిలాంత్రఫీస్ అనే ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న సంస్థలకు, పర్యావరణ సుస్థిరత కోసం విరాళాలు అందజేస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో రోహిణి నిలేకరి రూ.154 కోట్లు విరాళాలుగా అందించింది. దాతల్లో పిన్న వయస్కుడు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (38) మొదటి స్థానంలో ఉన్నారు. మానసిక ఆరోగ్యం, ఆర్ధిక అక్షరాస్యత, విద్యారంగం కోసం నిఖిల్ కామత్ విరాళాలు ఇచ్చారు.
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ 2024 లో గత ఆర్ధిక సంవత్సరంలో 203 మంది దాతలు 8,783 కోట్ల విరాళాలు ఇచ్చారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే విరాళాలు 55 శాతం పెరిగాయి. 18 మంది దాతలు రూ.100 కోట్లకుపైగా విరాళాలు అందించారు. 30 మంది దాతలు రూ.50 కోట్ల పైచిలుకు, 61 మంది దాతలు రూ.20 కోట్ల పైచిలుకు విరాళాలు అందజేశారు.