Jagan: ఇవి అందరూ అంటున్న మాటలే: చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ రిప్లయ్

Jagan take a dig at Chandrababu over social media posts

  • సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
  • ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఫైర్
  • ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్న జగన్
  • సుప్రీం మార్గదర్శకాలు పాటించడంలేదని విమర్శలు

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని వదిలిపెట్టేది లేదంటూ సీఎం చంద్రబాబు ఇవాళ గట్టి హెచ్చరికలు జారీ చేయగా... వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు వ్యాఖ్యలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే చాలు... అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

వీళ్ల అఘాయిత్యాలపై ఎవరూ ప్రశ్నించకూడదా? ఆఖరికి వరదసాయంపై నిలదీసినా తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక, కరెంట్ చార్జీలు, మద్యం మాఫియాపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా? పోర్టుల ప్రైవేటీకరణపై ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే ఎవరూ నిలదీయకూడదా? అంటూ ధ్వజమెత్తారు. 

"విద్య వద్దు... మద్యం ముద్దు అని ఓ పిల్లవాడు పోస్టు పెట్టాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చెప్పిన మాటల్లో తప్పేముంది? నిజమే కదా... అమ్మ ఒడి ఇవ్వడంలేదు, విద్యా దీవెన ఇవ్వడంలేదు, వసతి దీవెన ఇవ్వడంలేదు. నాన్నకు ఫుల్లు... అమ్మకు నిల్లు అని ఆ పోస్టులో ఉంది... అందులో ఏం తప్పుంది? చంద్రబాబు గారి అభిమానుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్టు ఉందని కేసు పెట్టారు.

మరో పోస్టును ఫార్వార్డ్ చేసినా కేసు పెట్టారు. జనసేన నేతలతో బలవంతంగా కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు... అని ఆ పోస్టులో ఉంది. ఇలాంటివి అన్ని టీవీ చానళ్లలో కూడా వచ్చాయి. ఆ విధంగా వచ్చిన దాన్ని వీళ్లు ఫార్వార్డ్ చేశారంతే! పాపం... వాళ్ల మీద కూడా కేసు పెట్టేశారు. 

మరో సోషల్ మీడియా యాక్టివిస్టు... చంద్రబాబు, పవన్ విజయవాడ వరదల పేరుతో రూ.534 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని... కేవలం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకే రూ.23 కోట్లు ఖర్చు అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఇవి అందరూ అంటున్న మాటలే. ఈ పోస్టు పెట్టినందుకు కూడా కేసు బుక్ చేశారు. 

తిరుమల ఆలయంలో చంద్రబాబు తలపై పట్టువస్త్రాలు పక్కకు ఒరిగితే.... లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు అసత్యప్రచారం వెంకటేశ్వరస్వామికి కూడా నచ్చలేదు... అందుకే పట్టువస్త్రాలు పక్కకి పడిపోయాయి అంటూ మరో సోషల్ మీడియా యాక్టివిస్టు పోస్టు చేశాడు... పాపం, అంతకంటే అతడేమీ అనలేదు... కానీ అతడిపైనా కేసు పెట్టేశారు. వారం రోజులుగా ఈ తంతు విచ్చలవిడిగా జరుగుతోంది. 101 మందిని బుక్ చేసేశారు.

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ఇష్టం వచ్చినట్టు ఇంటికొచ్చి అరెస్ట్ చేయకూడదు, ఇష్టంవచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్లకూడదు... ఇలా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు ఓ ప్రొసీజర్ ఉంది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. 

విచారణ జరిపిన తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే వస్తే... ముందు వారెంట్ జారీ చేయాలి, ఆ తర్వాత మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి... ఇవి నేను చెబుతున్నవి కాదు... ఇవి సుప్రీంకోర్టు ఆదేశాలు. కానీ ఎక్కడా ఆదేశాలు పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ప్రశ్నించే గొంతుకలు నొక్కేసే విధంగా అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు" అంటూ జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News