KL Rahul: ప్చ్‌.. కేఎల్ రాహుల్ అక్క‌డ కూడా విఫ‌లం.. ఫామ్‌లేక తంటాలు ప‌డుతున్న‌ స్టార్ బ్యాట‌ర్‌!

KL Rahul Fails For India A Ahead Of Australia Tests

  • మెల్‌బోర్న్ వేదిక‌గా ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ మ్యాచ్‌
  • 4 ప‌రుగుల‌కే ఔట‌యిన కేఎల్ రాహుల్‌
  • ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న‌ బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ
  • కీల‌క టోర్నీ ముందు ఆందోళ‌న క‌లిగిస్తున్న రాహుల్ ఫామ్‌

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ను ఫామ్‌లేమి వెంటాడుతోంది. స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మొద‌టి టెస్టులో ఘోరంగా విఫ‌ల‌మైన రాహుల్ ఆ త‌ర్వాత మిగిలిన రెండు టెస్టుల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే, ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాలో జ‌రిగే బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీకి ఎంపిక‌య్యాడు. 

దాంతో బీసీసీఐ రాహుల్‌ను ప్రాక్టీక్ కోసం ఇండియా-ఏ త‌ర‌ఫున ఆడేందుకు ఆసీస్ పంపించింది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా-ఏతో జ‌రుగుతున్న అనాధికారిక రెండో టెస్టులో బ‌రిలోకి దిగాడు. కానీ, అక్క‌డ‌ కూడా ఫెయిల్ అయ్యాడు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవ‌లం 4 ప‌రుగులే చేసి పెవిలియ‌న్ చేరాడు. 

స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అత‌ను ఔట్ అయ్యాడు. త్వ‌ర‌లో భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా త‌ర‌పున స్కాట్ బోలాండ్ ఎంపిక‌య్యాడు. కేఎల్ రాహుల్‌తో పాటు ఇండియా టెస్టు జట్టుకు ఎంపికైన బెంగాల్ కెప్టెన్ అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ డ‌కౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగే తొలి టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్థానంలో ఈశ్వ‌ర‌న్ అందుబాటులో ఉంటాడు.

ఈశ్వ‌ర‌న్‌కు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 100 మ్యాచుల్లో అత‌ను 27 శ‌త‌కాలు బాదాడు. అత‌నికి  49.90 మంచి బ్యాటింగ్ స‌గ‌టు కూడా ఉంది. ఇక మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడే రాహుల్‌.. ఇండియా-ఏ మ్యాచ్‌లో మాత్రం ఓపెన‌ర్‌గా దిగాడు. 

More Telugu News