Allu Arjun: హీరో అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట
- ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్
- అనుమతులు లేకుండా జనసమీకరణ చేశారంటూ కేసు నమోదు
- కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన బన్నీ
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే... ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉండగా... అనుమతులు లేకుండా అల్లు అర్జున్ జన సమీకరణ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించింది.
ఎన్నికల సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతూ అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బన్నీని చూసేందుకు వేలాది మంది అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. రవి ఇంటి ముందు హంగామా చేశారు. ఈ క్రమంలో బన్నీతో పాటు, శిల్పా రవిపై నంద్యాల పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.