Rahul Gandhi: దేశం గురించి నేను నిజం చెబితే... విభజించినట్లు అవుతుందా?: రాహుల్ గాంధీ
- దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని అంగీకరిద్దామన్న రాహుల్ గాంధీ
- కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలుతుందని వ్యాఖ్య
- తెలంగాణలోని కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న రాహుల్ గాంధీ
దేశం గురించి తాను నిజం చెబితే... దేశాన్ని విభజించడం అవుతుందా? అని లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. కానీ తాను నిజం చెబుతున్నానన్నారు. దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని ఒప్పుకుందామని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లోని బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన ద్వారా ఎవరి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయో తేలిపోతుందని పేర్కొన్నారు.
కులగణన చేస్తామని తాను పార్లమెంట్ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన చేపట్టడం అభినందనీయమని రాహుల్ గాంధీ అన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణన చేసి... జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్లను పెంచుతామని వెల్లడించారు. రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తామన్నారు. కులగణనను వ్యతిరేకించే వారు ప్రజల నుంచి వాస్తవాలను దాచాలని చూస్తున్నారని విమర్శించారు.
కులగణన సందర్భంగా ఏ ప్రశ్నలు అడగాలనేది సామాన్యులే నిర్ణయించాలన్నారు. ఆ ప్రశ్నలను అధికారులు నిర్ణయించకూడదన్నారు. కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదన్నారు. కులగణనలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.