Ponguleti Srinivas Reddy: దీపావళి కానుకగా వారికి ఇళ్లు ఇవ్వబోతున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడి
- రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టీకరణ
- రైతులకు ఎక్కడా నష్టం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచన
అర్హులైన పేదలకు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాడు రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఇళ్లు ఎలా కట్టించారో... ఇప్పుడు కూడా అలాగే ఇస్తామన్నారు.
సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తిని తీసుకు రావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులకు ఎక్కడా నష్టం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు.
ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోయారన్నారు. రైతులు ఇబ్బందిపడకూడదని రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అర్హులైన రైతులందరికి తలతాకట్టు పెట్టైనా మిగతా రుణమాఫీ చేసి తీరుతామన్నారు.