CJI Chandrachud: రిటైర్‌మెంట్ కు కొన్ని రోజుల ముందు సుప్రీం సీజే ఆసక్తికర వ్యాఖ్యలు

DY Chandrachud said that CM and CJ meet each other and there is no judicial work

  • గణేశ్ పూజ కోసం ప్రధాని మోదీ తన నివాసానికి రావడంపై మాట్లాడిన చంద్రచూడ్
  • అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలే చర్చించబోమని వెల్లడి
  • రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్య

గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేశ్ పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరుకావడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ వివాదంపై రిటైర్‌మెంట్‌కు కొన్ని రోజుల ముందు జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. 

అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలేవీ చర్చించబోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో చాలా పరిణతి ఉందని, ఇలాంటి సమావేశాల సమయంలో పెండింగ్ కేసుల గురించి రాజకీయ నేతలు ఎప్పుడూ అడగరని ఆయన పేర్కొన్నారు. 

‘‘నేను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాను. కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించాక సీఎం ఇంటికి వెళ్లేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లేవారు. సమావేశాల ఎజెండాను నిర్ణయించేవారు. రాష్ట్రంలో 10 ప్రాజెక్టులు జరుగుతున్నాయని అనుకుందాం.. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత? అనే  ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి తెలిపేవారు. భేటీ కాకుండా లేఖల ద్వారా ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అది అయ్యే పని కాదు.

అంతేకాదు, న్యాయవ్యవస్థ బడ్జెట్ రాష్ట్రం నుంచే వస్తుంది. కానీ ఈ బడ్జెట్ జడ్జిల కోసం కాదు. జిల్లాల్లో కొత్త కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు కొత్త నివాసాలు కావాలి. ఇలాంటి వాటి కోసం ప్రధాన న్యాయమూర్తి - ముఖ్యమంత్రి సమావేశాలు కావడం అవసరం... ఈ సమావేశాల్లో కేసుల ప్రసక్తి రాదు" అని సీజే డీవై చంద్రచూడ్ అన్నారు.  

ఆగస్టు 14, జనవరి 26, పెళ్లి లేదా సంతాప వేదికలలో ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్ ఒకరినొకరు కేవలం కలుసుంటారంతే, జుడీషియల్ వ్యవహారాలేమీ అక్కడ చర్చకు రావని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘లోక్‌సత్తా’ వార్షిక ఉపన్యాసంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు కావడం ఒక ఆనవాయతీ అని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ భేటీలు ఎందుకని జనాలు భావిస్తున్నారని, కానీ రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల అపారమైన గౌరవం ఉందని, ఈ విషయంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


  • Loading...

More Telugu News