KTR: దివాలీ పేరుతో రాజ్ పాకాల పార్టీ... కేటీఆర్ బావమరిది డ్రగ్స్ ఇచ్చారంటూ సాఫ్టువేర్ కంపెనీ సీఈవో వాంగ్మూలం

KTR brother in law Raj Pakala booked after raid on his Janwada

  • 21 గంటల పాటు సాగిన పోలీసుల సోదాలు
  • విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు
  • విదేశీ మద్యం, పేక, క్యాసినోలో వినియోగించే కాయిన్స్‌ను గుర్తించిన పోలీసులు
  • రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల ఇళ్లలోనూ తనిఖీలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీపై పోలీసుల దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రేవ్ పార్టీ అని అధికార పార్టీ... కాదు కాదు ఫ్యామిలీ పార్టీ అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్ పాకాల దివాలీ పేరుతో ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఫాంహౌస్‌లో పోలీసులు దాదాపు 21 గంటలపాటు సోదాలు జరిపారు. శనివారం అర్ధరాత్రి 11.30 గంటల నుంచి నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగించారు.

డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా రాజ్ పాకాల స్నేహితుడు మద్దూరి విజయ్‌కి పాజిటివ్ వచ్చింది. అతను కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రాజ్ పాకాలతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఓ సాఫ్టువేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నానని విజయ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. రాజ్ పాకాల, విజయ్‌పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్‌తో పాటు గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పార్టీకి 21 మంది పురుషులు, 14 మంది మహిళలు హాజరైనట్లు తెలిపారు. మరోవైపు, పోలీసులు జరిపిన సోదాల్లో పన్ను చెల్లించని 12 విదేశీ మద్యం సీసాలు, సుంకం చెల్లించని ఢిల్లీ, మహారాష్ట్ర మద్యం, పేక, క్యాసినోలో వినియోగించే కాయిన్స్ నాలుగు సూట్‌కేసులలో పోలీసులు గుర్తించారు.

ఫాంహౌస్ ఘటన నేపథ్యంలో రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదులు రాజ్ పాకాల, శైలేంద్ర నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహణ, సుంకం చెల్లించని మద్యం కలిగి ఉన్నందుకు ఎక్సైజ్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.

రాయదుర్గంలోని కేటీఆర్ బావమరుదుల ఇళ్లలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న విషయం తెలిసి అక్కడకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాగంటి గోపినాథ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ నేతలు బాల్క సుమన్, క్రిశాంక్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. భారీ బందోబస్తు మధ్య రాత్రి వరకు తనిఖీలు పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News