KTR: అన్నిటికీ తెగించే వచ్చాం: కేటీఆర్
- జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మీడియాతో మాట్లాడిన కేటీఆర్
- రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని ఫైర్
- కుట్రలతో తమ గొంతు నొక్కలేరని వ్యాఖ్య
- ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వచ్చామన్న మాజీ మంత్రి
జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు.
"ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మా కుటుంబ సభ్యులు, బంధువులపై కేసులు పెడుతున్నారు. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వచ్చాం. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నా బావమర్ది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? గృహ ప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు.
వృద్ధులు, పిల్లలు సహా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? పార్టీలో అసలు మాదకద్రవ్యాలు దొరకలేదు. మా ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక కుట్రలకు తెరలేపారు.
మా ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. కుట్రలు చేసి మా గొంతునొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. మూసీ కుంభకోణం, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమర్దికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక కుంభకోణాలను బీఆర్ఎస్ బయటపెట్టింది. చేతనైతే రాజకీయంగా తలపడండి. ఇచ్చిన హామీలను అమలు చేయండి" అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.