Harish Rao: రాజ్ పాకాల ఫాంహౌస్‌లో తనిఖీలపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish rao responds on Raj Pakala Farm house issue

  • సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు 'పార్టీ, డ్రగ్స్' అంటున్నారని మండిపాటు
  • కేటీఆర్‌పై బురద జల్లే ఉద్దేశంతో డ్రగ్స్ కేసు అంటూ కుట్ర చేస్తున్నారని హరీశ్ రావు
  • ఫంక్షన్ ఉన్న విషయం తెలిసి... ప్రణాళికతో కుట్ర చేశారన్న హరీశ్ రావు
  • ఫంక్షన్‌కు కేటీఆర్ వెళ్లకపోయినా వెళ్లినట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో తనిఖీలపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌పై బురదజల్లే ఉద్దేశంతో బావమరిదిపై డ్రగ్స్ కేసు అంటూ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం జన్వాడ ఫాంహౌస్‌లో పార్టీ, డ్రగ్స్ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.

రాజ్ పాకాల నివాసంలో ఫంక్షన్ ఉన్న విషయం ప్రభుత్వానికి ముందే తెలుసునన్నారు. రాష్ట్రంలో బాంబులు పేలుతాయని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ముందుగానే చెప్పారని గుర్తు చేశారు. వాళ్లు చెప్పినట్లుగానే చేశారని, కానీ ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడి చేయడం చూస్తుంటే ఇది పక్కా ప్రణాళిక అని తెలిసిపోతోందన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీగా చిత్రీకరించడం దారుణమన్నారు. ఈ ఫంక్షన్‌లో వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు ఉన్నారని వెల్లడించారు.

పైగా ఈ ఫంక్షన్‌కు కేటీఆర్ గానీ ఆయన భార్య కానీ వెళ్లలేదని, కానీ వాళ్లు కూడా వెళ్లినట్లు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేటీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు లొంగవద్దన్నారు. వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేయవద్దని కోరారు. రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కుటుంబ సభ్యలను అడ్డం పెట్టుకొని, కుటుంబ ఫంక్షన్‌ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News