India: 2035 నాటికి మనకూ ఓ స్పేస్ స్టేషన్

India will own a spase station by 2035

  • ఇప్పటికే అగ్రరాజ్యాలకు సొంతం అంతరిక్ష కేంద్రాలు
  • సొంత అంతరిక్ష కేంద్రం కోసం ఇస్రో, బయోటెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం
  • 2028 నాటికి తొలి మాడ్యూల్ పూర్తి

ఐఎస్ఎస్... ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్... దీంట్లో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థ, జపాన్, కెనడా అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇక, టియాంగాంగ్ పేరిట చైనాకు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉంది. అంతరిక్ష రంగంలో ఎవరికీ సాధ్యం కాని కొన్ని ఘనతలు సాధించిన భారత్ కూడా స్పేస్ స్టేషన్ రేసులోకి దిగింది. 

2035 నాటికి భారత్ కూడా సొంత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇవాళ ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దేశంలో శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో నూతన శకానికి ఈ ఒప్పందం నాంది కానుంది. 

సొంత స్పేస్ స్టేషన్ భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. అంతేకాదు, బయోఈ3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్ అండ్ ఎంప్లాయ్ మెంట్) పాలసీ సాకారం చేయడం కూడా ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. 

సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, స్పేస్ బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఆస్ట్రోనాటిక్స్, స్పేస్ బయాలజీ రంగాల్లో ఇస్రో, బయోటెక్నాలజీ విభాగం మధ్య పరస్పర సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. 

కాగా, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)లో తొలి మాడ్యూల్ ను 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. 2035 నాటికి పూర్తి స్థాయిలో బీఏఎస్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఇక 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్రకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

  • Loading...

More Telugu News