Pakistan: ఇదీ... పాకిస్థాన్ క్రికెట్ అంటే...!: షాహిద్ అఫ్రిది

Shahid Afridi hails Pakistan team after series victory against England

  • ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ నెగ్గిన పాకిస్థాన్
  • తొలి టెస్టులో రికార్డు పరాజయం
  • ఆ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గిన పాక్
  • రాబోయే మరిన్ని విజయాలకు ఇది నాంది అంటూ అఫ్రిది ట్వీట్

ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టుగా పాకిస్థాన్ టీమ్ కు ఉన్న పేరును ఎవరూ చెరిపివేయలేరేమో! ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

తొలి టెస్టులో అతి భారీ పరాజయం చవిచూసిన పాక్ జట్టు... ఆ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గి, ఏకంగా సిరీస్ నే కైవసం చేసుకోవడం ప్రపంచ క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇవాళ ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 

బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది వంటి స్టార్లు ఎవరూ లేకుండానే పాక్ ఈ ఘనత సాధించడం విశేషం. దాంతో, ఎప్పుడూ తమ జట్టును నానా తిట్లు తిట్లే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా, మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.

"పాకిస్థాన్... ఎంత చక్కగా ఆడావు. తొలి టెస్టులో అంత దారుణంగా ఓడిపోయాక... కోలుకుని వరుసగా రెండు టెస్టులు నెగ్గడం పాకిస్థాన్ జట్టు మాత్రమే చేయగలదు. నోమన్ అలీ, సాజిద్ తమ నైపుణ్యాలతో సిరీస్ స్వరూపాన్నే మార్చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను స్పిన్ ఉచ్చులో బిగించి విలవిల్లాడేలా చేశారు. 

పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సాద్ షకీల్ మూడో టెస్టులో ఆడిన తీరు అమోఘం. ఎంతో పట్టుదలతో, కసితో ఆడాడు. పాకిస్థాన్ జట్టు కలసికట్టుగా ఆడి యావత్ జాతి స్ఫూర్తిని అమాంతం పెంచేసింది. 

సంపూర్ణ శక్తిసామర్థ్యాలతో పాకిస్థాన్ క్రికెట్ మళ్లీ జూలు విదిల్చింది. ఇది కదా... పాకిస్థాన్ క్రికెట్ అంటే. ఈ ఘనవిజయం ఆరంభం మాత్రమే... మరిన్ని విజయాలకు ఇది నాంది" అని షాహిద్ అఫ్రిది అభివర్ణించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News