Jagga Reddy: ట్రోలింగ్ చేస్తే లీగల్ నోటీసులు ఇస్తా... నాకు దొరికితే బట్టలూడదీసి కొడతా: జగ్గారెడ్డి

Jagga Reddy warns trollers

  • తనపై, సీఎంపై, ఇతర కాంగ్రెస్ నేతలపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం
  • నాయకుల ప్రసంగాలను ఎడిట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని మండిపాటు
  • బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం

తాను అనని మాటలను అన్నట్లుగా ట్రోలింగ్ చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. తనను ఇష్టారీతిన ట్రోలింగ్ చేస్తున్న వారు తనకు దొరికితే బహిరంగంగానే బట్టలు ఊడదీసి కొడతానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై, సీఎంపై, ఇతర కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ట్రోలింగ్‌ పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు.

ఇటీవల కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల మీద కూడా సోషల్ మీడియా వేదికగా అవాకులు, చెవాకులు పేలుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుల ప్రసంగాలను ఇష్టారీతిన ఎడిట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

తాను ఓ మహిళా కలెక్టర్‌ను బూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారన్నారు. కానీ తాను ఏ కలెక్టర్‌నూ దూషించలేదని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News