Rahul Gandhi: సామాన్యుడి హెయిర్ కటింగ్‌ షాప్‌లోకి వెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర వీడియో ఇదిగో

Rahul Gandhi visited the Classic Hair Salon in Delhi and this is what happens next

  • టెన్షన్ పడుతూ ట్రిమ్మింగ్ చేసిన బార్బర్
  • సాధకబాధకాలు తెలుసుకున్న రాహుల్ గాంధీ
  • అప్యాయంగా కౌగిలించుకోవడంతో చెమర్చిన బార్బర్ కళ్లు 

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సామాన్య బార్బర్‌ను ఆశ్చర్యపరిచారు. బార్బర్ షాప్‌లోకి వెళ్లి గడ్డం ట్రిమ్మింగ్ చేయమంటూ సీటులో కూర్చున్నారు. ఎప్పుడూ టీవీలు, ఇతర వార్తా మాధ్యమాల్లో కనిపించే రాహుల్ గాంధీ ఊహించని విధంగా తన షాప్‌కు రావడంతో సదరు బార్బర్ ఆశ్చర్యపోయాడు. విపరీతంగా టెన్షన్ పడ్డాడు. వణుకుతున్న చేతులతో ట్రిమ్మింగ్ చేశాడు.

ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో ఉన్న ‘క్లాసిక్ హెయిర్ సెలూన్’కు వెళ్లారు. బార్బర్‌ అజిత్‌తో మాట్లాడి అతడి సాధకబాధకాలు, కలలు, ఆశయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 

నెలకు రూ.14,000 నుంచి రూ.15,000 మధ్య సంపాదిస్తున్నానని రాహుల్ గాంధీకి బార్బర్ అజిత్ చెప్పాడు. ఒక వ్యక్తి రూ.15,000ల్లో ఏం ఆదా చేస్తాడు, ఏమీ మిగలదు కదా అని రాహుల్ అన్నారు. ఇల్లు గడవడానికి, షాప్ రెంట్‌కే సరిపోతున్నాయని అజిత్ చెప్పాడు. ఇంటి అద్దె ఎంతని రాహుల్ ప్రశ్నించగా.. ‘‘ఇంటి అద్దె రూ.2,500. అయితే నేను దివ్యాంగుడిని కావడంతో ప్రభుత్వం నుంచి వస్తున్న రూ.2,500లను అద్దెకు ఇచ్చేస్తున్నాను. షాప్ పెట్టినప్పుడు మా భవిష్యత్తు మెరుగుపడుతుందని నేను అనుకున్నాను. ఎంతో కష్టపడి పని చేస్తున్నాను. కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం’’ అని అజిత్ బదులిచ్చారు. తన భార్య హార్ట్ పేషెంట్ అని అతడు వాపోయాడు. 

రాహుల్ గాంధీ తన షాప్‌కు రావడంపై స్పందిస్తూ ‘‘పేదలమైన మాకు అండగా నిలిచేందుకు కనీసం ఈ వ్యక్తైనా ఉన్నారు. లేదంటే ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? రాహుల్ గారిని కలవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అని అజిత్ చెప్పాడు.

కాగా ట్రిమ్మింగ్ పూర్తయిన అనంతరం షాప్ నుంచి బయటకు వెళ్లే ముందు బార్బర్ అజిత్‌ను రాహుల్ గాంధీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దీంతో అజిత్ కళ్లు ఒక్కసారిగా చెమర్చాయి. రాహుల్‌ తో పాటు బయటకు వెళ్లి వీడ్కోలు చెప్పాడు. ఇక ట్రిమ్మింగ్ చేస్తున్న సమయంలో అజిత్ చేతులు టెన్షన్‌తో వణికాయి. దీంతో అతడి చెయ్యి పట్టుకొని టెన్షన్ పడొద్దని, ఆందోళన వద్దు అని రాహుల్ గాంధీ అన్నారు. ఔను సార్ బాగా ఒత్తిడిగా ఉందని అతడు చెప్పాడు.

కాగా అజిత్ భాయ్ మాట్లాడిన నాలుగు మాటలు, అతడి కన్నీళ్లు నేడు దేశంలోని కష్టపడి పనిచేసే ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తుల కథను చాటి చెబుతున్నాయని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

  • Loading...

More Telugu News