TTD: వృద్ధులు, వివిధ వ్యాధులున్నవారికి టీటీడీ కీలక సూచన

TTD advises that elderly people and people suffering from various diseases not come to Tirumala on foot

  • కాలినడకన తిరుమలకు రావడం శ్రేయస్కరం కాదని ప్రకటన
  • భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని వెల్లడి
  • ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

కోరిన కోర్కెలు తీర్చే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు, దర్శనం చేసుకునేందుకు కాలినడకన తిరుమల చేరుకునే భక్తుల సంఖ్య పెద్దగానే ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అలిపిరి మార్గంలో ప్రతి నిత్యం వేలాది మంది తరలి వెళుతుంటారు. వీరిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉంటారు. అలాంటివారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది.  

ఇటీవల కాలినడకన తిరుమలకు వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని టీటీడీ అప్రమత్తం చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు షుగర్, బీపీ, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కాలినడకన తిరుమల రావడం మంచిది కాదని తెలియజేస్తూ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తిరుమల కొండ సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుందని, అందుకే ఆక్సిజన్‌ స్థాయి తక్కువని ఈ సందర్భంగా పేర్కొంది.

కాలినడకన రావడం చాలా అలసటతో కూడుకున్నదని, అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని సూచించింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అలిపిరి మార్గంలో 1500వ మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సాయం పొందవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News