Satya Nadella: ప్రోత్సాహకం భారీగా తగ్గినా... 63 శాతం పెరిగిన సత్య నాదెళ్ల వేతనం!
- 79.1 మిలియన్ డాలర్లు అందుకోనున్న సత్య నాదెళ్ల
- 31 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ షేర్లు
- ప్రోత్సాహకంలో 5.5 మిలియన్ డాలర్ల కోత
జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకోనున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న 48.5 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు 31 శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ వాల్యూ 3 ట్రిలియన్ డాలర్లను దాటింది. ఈ క్రమంలో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డులు 39 మిలియన్ డాలర్ల నుంచి 71 మిలియన్ డాలర్లకు పెరిగాయి. సత్య నాదెళ్లకు చెల్లించే వాటిలో అధిక భాగం స్టాక్స్ రూపంలో ఉన్నాయి.
అయితే, మైక్రోసాఫ్ట్‌లో అందించిన సేవలకు గాను సత్య నాదెళ్లకు 5.2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం అందనున్నట్లు ఫైలింగ్‌లో తెలిపింది. ఆయనకు రావాల్సిన 10.7 మిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువ. ప్రోత్సాహకంలో 5.5 మిలియన్ డాలర్ల కోత పడింది. అంటే మన కరెన్సీలో ఇది 46 కోట్లకు పైగా ఉంటుంది. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పలు సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా ప్రోత్సాహకం తగ్గినట్లుగా తెలుస్తోంది.