Rohit Sharma: రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. సచిన్ రికార్డు సమం చేసిన హిట్‌మ్యాన్!
- అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు డకౌటైన ఆరో భారత ఆటగాడిగా రోహిత్
- మాస్టర్ బ్లాస్టర్ సచిన్ డకౌట్ల (34) రికార్డు సమం
- కివీస్‌తో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో ఈ చెత్త రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్
- నిన్న పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన భారత కెప్టెన్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు డకౌటైన ఆరో భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ 34 సార్లు డకౌటయ్యారు. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ చెత్త రికార్డు నెలకొల్పారు.
ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డకౌట్ల (34) రికార్డును రోహిత్ సమం చేశాడు. ఇక ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43), ఇషాంత్ శర్మ (40), విరాట్ కోహ్లీ (38), హర్భజన్ సింగ్ (37), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్‌కు దిగిన హిట్‌మ్యాన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇలా టెస్టుల్లో డకౌట్ కావడం రోహిత్‌కి ఇది ఆరోసారి.
పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. కేవలం 259 పరుగులకే ఆలౌట్ చేశారు. వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో విజృంభించగా.. అశ్విన్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.