Ponguleti Srinivas Reddy: ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయి.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Minister Ponguleti Sensational Comments

  • ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి అంశాలపై దర్యాప్తు పూర్తయిందన్న మంత్రి పొంగులేటి
  • ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రుల బృందం
  • హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి ముందే చర్యలు ఉంటాయని స్పష్టీకరణ
  • ప్రధాన నేతలకు భారీ షాక్ ఉండబోతోందన్న మంత్రి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి అంశాలపై విపరీతమైన చర్చ జరిగింది. ఇప్పుడు వీటిపై దర్యాప్తు పూర్తికావడంతో త్వరలోనే చర్యలు ఉంటాయన్న సంకేతాలు వెల్లడయ్యాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్కడ ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపావళికి ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబు పేలబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన నేతలకు భారీ షాక్ తగలబోతోందని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, ధరణి సహా 8 నుంచి 10 ప్రధాన అంశాలకు సంబంధించిన ఫైళ్లు సాక్ష్యాధారాలతో సిద్ధమైనట్టు మంత్రి పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లో అడుగుపెట్టే లోపే చర్యలు
సియోల్‌లోని హాన్ నది పునరుజ్జీవంపై అధ్యయనానికి వెళ్లిన మంత్రుల బృందం హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి ముందే చర్యలు ఉంటాయని పొంగులేటి స్పష్టం చేశారు. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టేది లేదని, పూర్తి ఆధారాలతో చర్యలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ దాదాపు పూర్తయిందని, ఫోన్ ట్యాపింగ్, ధరణి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాల్లో ఎలాంటి చర్యలు లేవని అనుకోవద్దని, ప్రజలు కోరుకునేలా పూర్తి ఆధారాలతో వస్తున్నట్టు చెప్పారు. 15 దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ రెవెన్యూ విధానాలను అధ్యయనం చేసి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించినట్టు మంత్రి తెలిపారు. 

  • Loading...

More Telugu News