handloom co operative societies: త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు: మంత్రి సవిత

minister savita will soon hold elections for handloom co operative societies

  • ఎన్నికల హామీల అమలుకు సీఎం చంద్రబాబు కట్టుబడిన ఉన్నారన్న మంత్రి సవిత 
  • ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సవిత ఆదేశం
  • చేనేతకు క్యాష్ లెస్ వైద్యం అందించేలా బీమా సదుపాయం ఏర్పాటు చేస్తామన్న మంత్రి సవిత

చేనేత సహకార సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణ స్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్‌లో వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, ఏడీలతో బుధవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేతలకు ప్రస్తుత ట్రెండ్ తగ్గట్లు శిక్షణ అందజేసి, తయారైన వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పించనున్నామని తెలిపారు. చేనేతలకు క్యాష్ లెస్ వైద్యం అందించేలా బీమా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.  

మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామన్నారు. నూలుపై 15 శాతం సబ్సిడీ కూడా అందజేయనున్నామన్నారు. ఇవే కాకుండా 2014-19 మధ్య అమలు చేసిన అన్ని పథకాలనూ చేనేతలకు అందివ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ముద్ర రుణాలపై చేనేత కార్మికులకు వ్యక్తిగత, సామూహిక రుణాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతమున్న టెక్స్ టైల్స్ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు చీరాలలో నూతన టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  

రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు పథకాలపై చేనేతలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేనేత కార్మికులు ఎంత మేర నష్టపోయారు అనే విషయాలపై నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ , జేడీ కన్నబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News