Chandrababu: వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించండి.. సీఎం చంద్రబాబుకు ముస్లిం సంఘాల వినతి
- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు
- కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు యాక్ట్ చట్ట సవరణపై తమ అభ్యంతరాలు వివరించిన ప్రతినిధులు
- చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన సీఎం చంద్రబాబు
ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో బుధవారం కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు.
కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని.. ఈ చర్య ముస్లిం వర్గ హక్కులు, మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించ వద్దని, పార్లమెంట్‌లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.