Roja Selvamani: వైసీపీని విమర్శించే అర్హత మీకు లేదు.. రాదు: హోంమంత్రి అనితపై రోజా ఫైర్!
- గుంటూరు, బద్వేల్ ఘటనలను ప్రస్తావిస్తూ రోజా ఆగ్రహం
- బాధిత కుటుంబాలను పరామర్శించలేరా అంటూ మంత్రి అనితపై మండిపాటు
- మంత్రిగా అనిత బాధ్యతలు మరిచారన్న రోజా
ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న హత్య, లైంగికదాడి ఘటనలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు.
మీ పార్టీ కార్యాలయానికి 10 కి.మీ. దూరంలోని గుంటూరు ఆసుపత్రిలో ఉన్న దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? అంటూ మంత్రిని రోజా నిలదీశారు. బద్వేల్లో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ హత్య జరిగి మూడు రోజులైందని, ఆ ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలనిపించలేదా? అని ప్రశ్నించారు. మంత్రిగా బాధ్యతలు మరిచిన మీకు వైసీపీని విమర్శించే అర్హత లేదు.. రాదు అని అనితను దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజా ఆరోపించారు.