YS Jagan: లా ట్రైబ్యునల్‌లో జగన్ పిటిషన్లు.. తల్లి, చెల్లితో ఆస్తుల వివాదమేనా?

YS Jagan vs YS Sharmila Jagan Files Petition In National Company Law Tribunal

  • నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఐదు పిటిషన్లు దాఖలు చేసిన జగన్
  • తల్లి, సోదరి సహా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణను ప్రతివాదులుగా చేర్చిన వైసీపీ అధినేత
  • తల్లి, సోదరికి షేర్లు కేటాయించినా వివిధ కారణాలతో కేటాయింపులు జరపలేదని వివరణ
  • వాటిని విత్ డ్రా చేసుకుంటున్నట్టు మరో పిటిషన్
  • విచారణను నవంబర్ 8కి వాయిదా వేసిన ట్రైబ్యునల్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తల్లి విజయలక్ష్మి.. సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఆస్తుల వివాదం ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే అన్నకు దూరంగా జరిగిన షర్మిల కాంగ్రెస్‌లో చేరినట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ ఆస్తుల వివాదం నిజమేనని తాజాగా నిర్ధారణ అయింది. ఆస్తుల వివాదంపై జగన్.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 

క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ విజయరాజశేఖర్‌రెడ్డితో పాటు జనార్దన్‌రెడ్డి చాగరి, యశ్వంత్‌రెడ్డి కేతిరెడ్డి, రీజనల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

గత నెల 3న ఒకటి, 11న మూడు, ఈ నెల 18న ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయలక్ష్మి, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, అయితే, వివిధ కారణాలతో కేటాయింపులు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ షేర్లను ఇప్పుడు విత్‌డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు.

సెప్టెంబర్ 3 నాటి పిటిషన్‌కు సంబంధించి రాజీవ్ భరద్వాజ్, సంజయ్‌పురికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణ నవంబర్ 8కి ట్రైబ్యునల్ వాయిదా వేసింది. జగన్ తరపున వై. సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు. తల్లి, సోదరితో ఆస్తుల వివాదానికి సంబంధించి విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నా అవన్నీ ఇప్పటి వరకు పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడీ పిటిషన్ల దాఖలు విషయం బయటకు రావడంతో అవి నిజమేనని నిర్ధారణ అయింది. 

  • Loading...

More Telugu News