Vasireddy Padma: వైసీపీకి వాసిరెడ్డి ప‌ద్మ రాజీనామా.. జ‌గ‌న్‌పై మ‌హిళా నేత ధ్వ‌జం!

 Vasireddy Padma Resign to YSRCP

  • జ‌గ‌న్ చేస్తున్న మోసాన్ని వ్య‌తిరేకించ‌డానికే తాను పార్టీ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • జ‌గ‌న్ హ‌యాంలో మహిళ‌ల‌కు స్వ‌ర్ణ‌యుగం అనుకుంటే అది చాలా పొర‌పాటు అని వ్యాఖ్య‌
  • రాజ‌కీయాలు చేయ‌డానికి మ‌హిళ‌ల‌ను అడ్డుపెట్టుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ఆగ్ర‌హం
  • త‌న‌ను పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరం చేయాల‌ని కుట్ర చేశారంటూ ధ్వ‌జం
  • రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యే ప్ర‌స‌క్తే లేద‌న్న వాసిరెడ్డి ప‌ద్మ‌

వైసీపీకి మ‌రో భారీ షాక్ త‌గిలింది. మరో సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి గుడ్ బై చెప్పారు. గ‌త కొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు పంపారు. 

రాజీనామాపై వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్
ఈ సంద‌ర్భంగా వైసీపీకి రాజీనామా చేయ‌డంపై ఆమె మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. పార్టీలో త‌న‌తో పాటు చాలామందికి కొంత‌కాలంగా తీవ్ర అన్యాయం జ‌రుగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. ఇది త‌మ‌కే కాకుండా రాష్ట్ర ప్ర‌జానీకానికి జ‌రుగుతున్న మోసం, అన్యాయమ‌ని ఆమె పేర్కొన్నారు. దీన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంత‌వ‌ర‌కైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నార‌ని వాసిరెడ్డి ప‌ద్మ మండిప‌డ్డారు. జ‌గ‌న్ చేస్తున్న మోసాన్ని వ్య‌తిరేకించ‌డానికే తాను పార్టీ వీడుతున్న‌ట్లు తెలిపారు. 

తాను మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న స‌మ‌యంలో త‌న‌వంతు సాయం చేశాన‌న్న ఆమె.. జ‌గ‌న్ ప‌రిపాల‌న కాలంలో రాష్ట్ర మ‌హిళ‌ల‌కు స్వ‌ర్ణ‌యుగం అనుకుంటే అది చాలా పొర‌పాటు అని అన్నారు. ఆయ‌న హ‌యాంలో కూడా మ‌హిళ‌ల ప‌ట్ల ఎన్నో వికృత సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. అప్పుడు సీఎంగానీ, హోంమంత్రిగానీ ఎందుకు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేద‌ని వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌శ్నించారు. ఇప్పుడు రాజ‌కీయాలు చేయ‌డానికి మ‌హిళ‌ల‌ను అడ్డుపెట్టుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌ని ఆమె అన్నారు. 

జ‌గ‌న్‌ను 11 స్థానాల‌కు ప‌రిమితం చేసిన కోట్లాది మంది రాష్ట్ర ప్ర‌జ‌లు ఏ అభిప్రాయంతో ఉన్నారో.. ఇవాళ తాను అదే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఏకాకిని కాద‌ని, త‌న వెంట చాలామంది ఉన్నారని ఆమె తెలిపారు. జ‌గ‌న్‌పై తాను ఒంట‌రి పోరాటం చేయ‌డంలేద‌ని, సామూహిక పోరాటం చేయ‌బోతున్నాన‌ని అన్నారు. ప్రస్తుత ప్ర‌భుత్వంలో నేర‌స్తుల‌ను పట్టుకోవ‌డంలో పోలీస్ వ్య‌వ‌స్థ బాగానే ప‌ని చేస్తోందన్నారు. అయితే, అస‌లు నేరాలు జ‌ర‌గ‌కుండా ఒక పటిష్ఠ‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకోరావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. దీనికోసం సామాజికంగా కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని వాసిరెడ్డి ప‌ద్మ పిలుపునిచ్చారు. 

త‌న‌ను పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌ని కుట్ర జ‌రిగింద‌న్నారు. త‌న‌కు జ‌రిగిన తీవ్ర అన్యాయంపై పోరాటం చేస్తాన‌ని పేర్కొన్నారు. కానీ తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లవైపే త‌న అడుగులు అని తెలిపారు.

  • Loading...

More Telugu News