Prabhas: ఇవాళ ప్రభాస్ బర్త్‌డే.. ఎన్ని సంవత్సరాలు నిండాయో తెలుసా?.. రాబోయే సినిమాల లిస్ట్ ఇదే

Today Pan India Star Prabhas Birth day and He turns 46 years

  • 45 ఏళ్లు నిండి 46వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యంగ్ రెబల్ స్టార్
  • ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు
  • వీటన్నింటి బడ్జెట్ రూ.2,100 కోట్ల పైమాటే

పాన్ ఇండియా నటుడు ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ ఇవాళ (బుధవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. నేటితో 45 ఏళ్లు నిండి 46వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ స్టార్ హీరో అనతికాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి, బాహుబలి-2, సలార్, కల్కి 2898 ఏడీ వంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌లతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నాడు. తెలుగు-తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలోనూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అందుకే ప్రభాస్ సినిమాలకు పెట్టుబడి విషయంలో నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

2024లో ప్రభాస్ రెండు భారీ హిట్‌లు అందుకున్నాడు. తొలుత సలార్‌తో ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రూ.618 కోట్లు రాబట్టాడు. ఆ తర్వాత విడుదలైన 'కల్కి 2898 ఏడీ'తో నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించాడు. ప్రభాస్-దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1042.25 కోట్లు వసూలు చేసింది.

ఈ భారీ హిట్‌ల తర్వాత ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మరో ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ కలిపి రూ.2,100 కోట్లు పైగానే ఉండొచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో ఏ సినిమాకీ రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ లేదని, ఒక సినిమాకు గరిష్ఠంగా రూ.700 కోట్ల వరకు బడ్జెట్‌ ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రాబోయే ప్రభాస్ సినిమాలు, బడ్జెట్ అంచనాలు ఇవే..
1. సలార్ 2  - రూ.360 కోట్లు
2. స్పిరిట్ - రూ.320 కోట్లు
3. హను రాఘవపూడి ప్రాజెక్ట్ - రూ.320 కోట్లు
4. రాజా సాబ్ - రూ.400 కోట్లు
5. కల్కి 2898 ఏడీ సీక్వెల్ - రూ.700 కోట్లు.

కాగా ఈ ఐదు సినిమాల్లో కొన్నింటి విడుదల తేదీలు ఖరారయ్యాయి. కొన్నింటి తేదీలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News