Brad Hogg: సర్ఫరాజ్ ఖాన్‌కు ఆ బ‌ల‌హీన‌త ఉంది.. ఆస్ట్రేలియాలో క‌ష్ట‌మే: బ్రాడ్ హాగ్

One thing I am worried about Sarfaraz Khan Brad Hogg suspects weakness vs Bounce

  • బౌన్సీ పిచ్‌ల‌పై స‌ర్ఫ‌రాజ్ బ్యాటింగ్ టెక్నిక్ స‌రిపోద‌న్న హాగ్‌
  • బౌన్స్ ఎక్కువ‌గా ఉండే ఆసీస్‌, ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికాలో అత‌డు ఆడ‌లేడని జోస్యం
  • బౌన్సీ ట్రాక్‌లపై అత‌ని ప్రస్తుత బ్యాటింగ్ టెక్నిక్ వ‌ల్ల బ్యాట్‌ ఎడ్జ్ తీసుకుంటుంద‌ని వ్యాఖ్య‌

టీమిండియా యంగ్ ప్లేయ‌ర్‌ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ బ్యాటింగ్ టెక్నిక్‌పై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ సందేహాలు వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ఈ యువ బ్యాట‌ర్ ఆడుతున్న బ్యాటింగ్ టెక్నిక్‌తో బౌన్సీ పిచ్‌ల‌పై ఆడ‌డం అంత సుల‌భం కాద‌న్నాడు. అదనపు బౌన్స్‌ను త‌ట్టుకుని సర్ఫరాజ్ బ్యాటింగ్ చేయ‌డం క‌ష్ట‌మ‌న్నాడు. 27 ఏళ్ల ఈ బ్యాట‌ర్ త‌న శ‌రీరానికి ద‌గ్గ‌రగా వ‌చ్చే బంతుల‌ను ఫ్రీ హ్యాండ్‌తో ఆడ‌లేడ‌ని, అలాంటి స‌మ‌యంలో బౌన్స‌ర్లకు బోల్తా కొట్ట‌డం ఖాయ‌మ‌ని హాగ్ పేర్కొన్నాడు. 

బౌన్సీ ట్రాక్‌లపై అత‌ని ప్రస్తుత బ్యాటింగ్ టెక్నిక్ వ‌ల్ల బ్యాట్‌ ఎడ్జ్ తీసుకుని ఔట‌య్యే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని తెలిపాడు. ప్ర‌ధానంగా బౌన్స్ ఎక్కువ‌గా ఉండే 'సెనా' (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత‌ని ఈ బ‌ల‌హీన‌త తీవ్రంగా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చాడు. రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సర్ఫరాజ్ ఆడితే.. పాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి బౌల‌ర్ల‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని, అత‌డు ఎలా ఆడ‌తాడ‌న్న‌ది చూడాల‌ని పేర్కొన్నాడు.

“సర్ఫరాజ్ ఖాన్ విష‌యంలో నాకు ఒక‌టే ప్ర‌ధాన లోపం క‌నిపిస్తోంది. అత‌డు ప్రస్తుతం ఆడుతున్న టెక్నిక్‌తో బౌన్స్ ఎక్కువ‌గా ఉండే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో బౌన్స‌ర్లు ఆడ‌లేడు. శ‌రీరానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే బంతుల విష‌యంలో స‌ర్ఫ‌రాజ్‌కు ఫ్రీ హ్యాండ్ లేదు. అలాంట‌ప్పుడు బ్యాట్ ఎడ్జ్ తీసుకునే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌. ఈ టెక్నిక్‌తో అత‌డు ఇబ్బంది ప‌డొచ్చు” అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. 

నవంబర్ 22న ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సర్ఫరాజ్‌కు భార‌త స్క్వాడ్‌లో చోటు ద‌క్క‌వ‌చ్చ‌ని, అయితే తుది జ‌ట్టులో ఛాన్స్ వ‌స్తే అత‌డు ఎలా ఆడ‌తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం అని హాగ్ పేర్కొన్నాడు. ఇక ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో స్వ‌దేశంలో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు పేసర్ల బౌన్స్‌ను స‌ర్ఫ‌రాజ్ స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవడం, దానికోసం అత‌డు స‌రికొత్త మార్గాలను కనుగొన‌డం బాగుంద‌ని బ్రాడ్ హాగ్ తెలిపాడు.

అటు కివీస్‌తో రెండో టెస్టుకు తుది జ‌ట్టులో త‌ప్ప‌కుండా స‌ర్ఫ‌రాజ్ ఉండాల‌ని హాగ్ చెప్పాడు. మెడ నొప్పి కార‌ణంగా తొలి టెస్టుకు దూర‌మైన శుభ్‌మ‌న్ గిల్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ జ‌ట్టులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అత‌డు ఫిట్‌గా ఉండ‌డంతో రెండో టెస్టు ఆడ‌డం దాదాపు ఖాయం. దాంతో ఫామ్‌లేక ఇబ్బంది ప‌డుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో గిల్‌ను ఆడించాల‌ని, స‌ర్ఫ‌రాజ్‌ను అలాగే కొన‌సాగించాల‌ని హాగ్ చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News