Narendra Modi: 2019 తర్వాత తొలిసారి.. నేడు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ
- ఇరుదేశాధినేతల భేటీని నిర్ధారించిన విదేశాంగ శాఖ
- విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటన
- బ్రిక్స్ సదస్సు కోసం ఇప్పటికే రష్యాలోని కజాన్‌లో ఉన్న మోదీ, జిన్‌పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ కానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కీలక పరిణామాన్ని ధ్రువీకరించింది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా ప్రకటన చేశారు.
లడఖ్‌లో ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్‌పై ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన అంగీకారం కుదిరిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 తర్వాత ఇరు దేశాలకు చెందిన ఈ అగ్రనేతలు ఇద్దరూ పరస్పర ద్వైపాక్షిక భేటీ కానుండడం ఇదే తొలిసారి. 2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత వీరిద్దరూ పరస్పర ద్వైపాక్షిక భేటీలో పాల్గొనలేదు.
2022లో బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో, దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2023 బ్రిక్స్ సదస్సుల్లో మోదీ, జిన్‌పింగ్ కలిసినప్పటికీ ద్వైపాక్షిక అంశాలపై పెద్దగా చర్చించలేదు. ఈ రెండు సందర్భాల్లోనూ క్లుప్తంగా మాత్రమే మాట్లాడుకున్నారు. 2023 బ్రిక్స్ సదస్సులో సైనిక ప్రతిష్టంభనకు పరిష్కార ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ఇద్దరూ అంగీకరించారు. దీంతో నేటి భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా మే 2020లో గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాలు తీవ్ర ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. నాటి నుంచి ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. సరిహద్దులో పెట్రోలింగ్‌పై గత నాలుగేళ్లుగా జరుగుతున్న చర్చలకు ఇటీవలే శుభంకార్డు పడింది. పెట్రోలింగ్‌పై ఇరు దేశాలు కీలక అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే.