Hyderabad: హోటల్లో వెంటపడిన శునకం.. మూడో అంతస్తు నుంచి పడి యువకుడి మృత్యువాత!
![Youngman Died After Falling from the Third Floor of Hyderabad Hotel](https://imgd.ap7am.com/thumbnail/cr-20241022tn6717171f8e405.jpg)
- హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఆదివారం రాత్రి ఘటన
- స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లిన ఉదయ్
- మూడో అంతస్తు బాల్కనీలో ఉదయ్‌ను తరిమిన శునకం
- దాని నుంచి తప్పించుకునే క్రమంలో కిటికీలోంచి కిందపడి మృతి
హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్‌కు వెళ్లిన యువకుడికి శునకం వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి మృత్యువాత పడ్డాడు. ఏపీలోని తెనాలికి చెందిన ఉదయ్ (23) అనే యువకుడు ఆర్సీపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
అయితే, ఆదివారం మిత్రులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్ అనే హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ మూడో అంతస్తుకు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్ వెంటపడింది. దాంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీలోంచి అతడు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. తాజాగా బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.