Nara Lokesh: ఇతర రాష్ట్రాలతో కాదు... దేశాలతోనే మాకు పోటీ!: ఏపీ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh attends ICEA meet in New Delhi

  • ఢిల్లీలో ఐసీఈఏ సమావేశం
  • హాజరైన ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్
  • ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చే చర్యలపై వివరణ 

ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కేవలం ఇతర రాష్ట్రాలతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీపడుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ప్రతినిధులతో మంత్రి లోకేశ్ నేడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షత వహించారు. 

ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ విశదీకరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... దేశంలో పేరెన్నికగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, తరచూ వారితో సమావేశమై పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమదారుల కోసం అవసరమైన మేరకు కచ్చితమైన విధానాలు రూపొందిస్తామని అన్నారు. 

ఏపీలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాల అమలు

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోంది. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం. 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు దూరదృష్టి గల నాయకత్వంలో అభివృద్ధి దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడీబీని పునరుద్దరించాం. 

సరైన ప్రతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. విశాఖపట్నాన్ని ఐటీ పవర్ హౌస్ గా, అంతర్జాతీయ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. 

తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం

తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి పరిశ్రమదారుల సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ప్రపంచంలో పేరెన్నిగన్న డిక్సన్, డైకిన్, టీసీఎల్ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. 

అనంతపురంలో కియా మోటార్స్ ఇప్పటికే పనిచేస్తోంది, అనంతపురం, కర్నూలు జిల్లాలను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఈవీ కీలక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అమెరికాలో వాషింగ్టన్ మాదిరిగా ఏపీ పరిపాలన కేంద్రం అమరావతిని తీర్చిదిద్దడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది.

  • Loading...

More Telugu News