Ayyanna Patrudu: అసెంబ్లీ సమావేశాలకు జగన్ ను ఆహ్వానిస్తున్నా: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu invites Jagan to assembly sessions

  • అనకాపల్లి జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం
  • హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
  • నర్సీపట్నంకు 100 రోజుల్లో రూ.40 కోట్లు తీసుకువచ్చానని వెల్లడి

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేడు అనకాపల్లి జిల్లాలో 'పల్లె పండుగ' పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్నారు. నాతవరం మండలం పెద్దగొలుగుండపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు రూ.1.4 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు రావాలని జగన్ ను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరం ముచ్చటించుకుందాం అని పేర్కొన్నారు. 

ఇక నియోజకవర్గం గురించి మాట్లాడుతూ, నర్సీపట్నంకు 100 రోజుల్లో రూ.40 కోట్లు తీసుకువచ్చానని వెల్లడించారు. నాతవరం మండలానికి భారీగా నిధులు కేటాయించామని, తాండవ గేటు మరమ్మతు పనులు పూర్తి చేయించామని అయ్యన్నపాత్రుడు వివరించారు. పంట సీజన్ ప్రారంభమైన వెంటనే కొత్త గేటు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. 

పోలవరంపై తాండవ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. తాండవ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం రూ.2,900 కోట్లు అని అయ్యన్న పేర్కొన్నారు. తాండవ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. 

అటు, నర్సీపట్నంలో ఇసుక అక్రమ నిల్వలను పట్టుకున్నామని, ఇసుక అక్రమ నిల్వలకు మాజీ ఎమ్మెల్యే బినామీలే కారణమని ఆరోపించారు. ఇసుక అక్రమ నిల్వలకు రూ.18 కోట్ల జరిమానా పడిందని తెలిపారు. గుమ్మడిగొండ, అల్లిపూడిలో ఇసుక తవ్వకాల్లో దోపిడీ జరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News