Naim Qassem: ప్రాణభయంతో ఇరాన్ పారిపోయిన హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిమ్

Hezbollah deputy Naim Qassem flees to Iran

  • హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి తర్వాత క్రియాశీలకంగా మారిన ఖాసిమ్
  • ఇజ్రాయెల్ ఆయనను హత్య చేసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ఇరాన్‌కు
  • ఇరాన్ విదేశాంగ మంత్రి విమానంలోనే బీరుట్‌ను విడిచిపెట్టినట్టు వార్తలు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడుతుండడంతో హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్, సెకండ్-ఇన్-కమాండ్ నయీమ్ ఖాసిమ్ ప్రాణభయంతో లెబనాన్ నుంచి ఇరాన్ పారిపోయినట్టు యూఏఈకి చెందిన ‘ఇరెమ్ న్యూస్’ ఓ కథనం ప్రచురించింది. 

నయీమ్ ఈ నెల 5నే బీరుట్‌ను విడిచిపెట్టాడంటూ ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ రాసుకొచ్చింది. లెబనాన్, సిరియా పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరగచి విమానంలోనే ఆయన బీరుట్ నుంచి ఇరాన్ చేరుకున్నట్టు తెలిపింది. ఇజ్రాయెల్ ఆయనను హత్య చేసే అవకాశం ఉందన్న ఇస్లామిక్ రిపబ్లిక్ నేతల హెచ్చరికలతోనే ఇరాన్ పారిపోయినట్టు వివరించింది. 

సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందిన తర్వాత ఖాసిమ్ మూడుసార్లు ప్రసంగించాడు. అందులో ఒకటి బీరుట్ నుంచి కాగా, రెండుసార్లు టెహ్రాన్ నుంచి మాట్లాడాడు. కాగా, హమాస్‌తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పటికే పలువురు హిజ్బుల్లా నేతలను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో నస్రల్లా మృతి తర్వాత ఖాసిమ్ క్రియాశీలకంగా మారాడు.

లెబనాన్‌లో షియాల అమల్ మూవ్‌మెంట్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఖాసిమ్.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ నేపథ్యంలో 1979లో దానిని వదిలిపెట్టాడు. ఆ తర్వాత హిజ్బుల్లా స్థాపనకు దారితీసిన సమావేశాల్లో పాల్గొన్నాడు. 1982లో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడిన తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతుతో హిజ్బుల్లా ఏర్పాటైంది. 1992లో తొలిసారి పార్లమెంటరీ ఎన్నికల్లో హిజ్బుల్లా పోటీ చేసింది. 

  • Loading...

More Telugu News