Tim Southee: 107 మీటర్ల భారీ సిక్సర్ బాదిన రిషభ్‌పంత్.. వైరల్‌ వీడియో ఇదిగో

Rishabh Pant hit a mammoth 107m six off Tim Southees delivery in Bengaluru Test

  • టిమ్ సౌథీ బౌలింగ్‌లో పంత్ భారీ సిక్సర్
  • స్టేడియం పైకప్పు మీద పడిన బంతి
  • 99 పరుగులు రాబట్టి భారత రెండో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన స్టార్ బ్యాటర్

బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చివరికి ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 99 పరుగుల వద్ద కివీస్ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. బంతి బ్యాట్ అంచుని తాకి స్టంప్స్‌కు గిరాటేయడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. మోకాలి గాయంతో రెండో రోజు మైదానాన్ని వీడిన పంత్ మూడో రోజు ఫీల్డ్‌లోకి రాలేదు. దీంతో బ్యాటింగ్ సమర్థవంతంగా చేయగలడో, లేదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, పంత్ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

వికెట్‌ను కాపాడుకుంటూనే పంత్ వేగంగా పరుగులు సాధించాడు. 105 బంతుల్లోనే 99 పరుగులు సాధించాడు. నాలుగు సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించాడు. ఒక సిక్సర్‌ను ఏకంగా 107 మీటర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఒక బంతిని బలంగా బాదాడు. టైమింగ్ కూడా కుదరడంతో అది 107 మీటర్ల సిక్సర్‌గా మారింది. దెబ్బకు బంతి వెళ్లి ఎం.చిన్నస్వామి స్టేడియం పైకప్పు మీద పడింది. ఈ షాట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

  • Loading...

More Telugu News