YS Jagan: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కూలిందడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?: జగన్

ys jagan fires on cm chandrababu

  • చంద్రబాబు సర్కార్‌పై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ విమర్శలు 
  • ప్రజారోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా ఘటనను ఉదాహరణగా పేర్కొన్న జగన్
  • బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ

చంద్రబాబు సర్కార్ తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లాలో అతిసార ప్రబలి 11 మంది మృతి చెందగా, వంద మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. 

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని జగన్ విమర్శించారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంలో మంచి ఆసుపత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీల మీద చికిత్స అందించడం దారుణమన్నారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  
 
లిక్కర్, ఇసుక స్కాంలో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు .. ప్రజల కష్టాలు గాలి కొదిలేశారని దుయ్యబట్టారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేదని విమర్శించారు. ఆరోగ్య శ్రీ నిర్వీర్యం అయిపోయిందని మండిపడ్డారు. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చి నుంచి పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు.  

జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని జగన్ మండిపడ్డారు. సీహెచ్‌సీ‌ల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసివేశారని, విలేజ్ క్లినిక్, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసే లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనులు నిలిచి పోయాయని పేర్కొన్నారు. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. తన వారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. 
 
ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగు నీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 

  • Loading...

More Telugu News