Rain Alert: రేపు ఏపీకి వర్ష సూచన... ఎల్లుండి అల్పపీడనం

Rain alert for Andhra Pradesh

  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు
  • బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఆవర్తనాలు
  • నేడు ఏపీలో విస్తారంగా వర్షాలు

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపున... అరేబియా సముద్రంలోని అల్పపీడన ప్రాంతం నుంచి ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 

రేపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

కాగా, అండమాన్ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 21న ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ అక్టోబరు 23 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

  • Loading...

More Telugu News