Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ శతకంపై సచిన్ ఏమన్నాడంటే...!
- బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు
- శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్
- కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ చేసిన యువ ఆటగాడిపై సచిన్, వార్నర్ ప్రశంస
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. వన్డే తరహా ఇన్నింగ్స్‌తో కేవలం 110 బంతుల్లోనే ఈ శతకం బాదాడు. అరంగేట్రం చేశాక నాలుగో టెస్టులోనే సర్ఫరాజ్‌కు తొలి సెంచరీ వచ్చింది.
ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఈ యువ ఆటగాడు.. టీమిండియాలో చోటు కోసం మాత్రం చాలా కాలంపాటు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు భారత జట్టులో చోటు దక్కడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు.
కివీస్‌తో టెస్టులో శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా దూరం కావడంతో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్ లో అందరూ భారత బ్యాటర్లతో పాటు ఘోరంగా విఫలమైన సర్ఫరాజ్ క్లిష్టమైన రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే భారత క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటూ పోస్ట్ చేశాడు. "సర్ఫరాజ్ ఖాన్.. జట్టుకి అవసరమైన సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి నీ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయడం చాలా గొప్ప విషయం. వెల్‌డన్" అంటూ అభినందించాడు.
సచిన్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా సర్ఫరాజ్‌ను మెచ్చుకున్నాడు. "నువు చేసిన హార్డ్‌వర్క్ కనిపిస్తోంది. గొప్ప ప్రదర్శన చేస్తున్నావ్. చాలా ఆనందంగా ఉంది సర్ఫరాజ్" అని వార్నర్ పోస్ట్ చేశాడు.