Google: అర్హతలు ఎక్కువగా ఉన్నాయని యువతికి ఉద్యోగాన్ని తిరస్కరించిన కంపెనీ

Google Techie Says was rejected a job as too good for the position

  • అర్హతలు ఎక్కువ ఉన్నవారు బాధ్యతలు పూర్తి చేయరన్న కంపెనీ
  • ఉద్యోగంలో చేరిన కొద్దికాలానికే వెళ్లిపోతారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నామని వెల్లడి
  • తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్న ఢిల్లీ టెకీ

ఉద్యోగాల భర్తీ సమయంలో ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ప్రాధాన్యత నిస్తుంటాయి. జీతం కాస్త ఎక్కువైనా అనుభవం ఉన్నవారివైపు మొగ్గుచూపుతుంటాయి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది ఓ స్టార్టప్ కంపెనీ. అసాధారణ రీతిలో ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థిని తిరస్కరించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ గూగుల్ టెకీ తనకు ఎదురైన ఈ ఆసక్తికరమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అర్హతలు చాలా మంచిగా ఉండడంతో తనకు ఉద్యోగాన్ని తిరస్కరించారని ఆమె వాపోయింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. 

అన్నూ శర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తాను గూగుల్‌లో పనిస్తున్నానని, ఇటీవల ఒక స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లికేషన్ పంపిస్తే అసాధారణ రీతిలో తిరస్కరణకు గురైందని ఆమె చెప్పారు. ‘అర్హతలు చాలా మంచిగా ఉన్నప్పటికి కూడా ఉద్యోగాన్ని తిరస్కరిస్తారని నాకు తెలియదు’ అనే క్యాప్షన్‌తో సదరు కంపెనీ నుంచి వచ్చిన రిప్లై స్క్రీన్ షాట్లను ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 

కాగా అన్నూ శర్మకు ఉద్యోగాన్ని తిరస్కరించడానికి గల కారణాన్ని సదరు స్టార్టప్ కంపెనీ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ని పరిశీలించిన తర్వాత మీ అర్హతలు ఈ ఉద్యోగ అవసరాలకు మించి ఉన్నాయని మేము గమనించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు వారి బాధ్యతలు సంపూర్ణంగా పూర్తి చేయడం లేదు. అంతేకాదు కంపెనీలో చేరిన కొద్దికాలానికి వెళ్లిపోతారని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం’’ అని కంపెనీ పేర్కొంది. నోటిఫికేషన్‌లో తాము పేర్కొన్న ఉద్యోగానికి సూచించిన అర్హతలు మాత్రమే సరిపోతాయని ముందుగానే పేర్కొన్నామని వివరించింది.

కాగా అన్నూ శర్మ ఎక్స్‌లో పెట్టిన ఈ పోస్టు‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. ఇలాంటి పరిస్థితి తమకు కూడా ఎదురైందని కొందరు పేర్కొన్నారు. ఎక్కువ అర్హత ఉండడంతో ఇటీవల తనకు కూడా ఉద్యోగం నిరాకరించారని, మంచి కాలేజీలో చదివినా పట్టించుకోలేదని ఓ నెటిజన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News