Mussoorie IAS Academy: చీర కట్టుకుని.. బొట్టుపెట్టుకుని.. లిప్‌స్టిక్ వేసుకుని.. ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో యువకుడి ఆత్మహత్య

 22 year old staff member dies by suicide at IAS academy in Mussoorie

  • అకాడమీలో మల్టీ టాస్కింగ్ స్టాఫర్‌గా పనిచేస్తున్న అనుకూల్ రావత్
  • మృతుడిది ఉత్తరాఖండ్‌లోని గర్వాల్
  • అనుకూల్ మానసిక స్థితిపై పోలీసుల అనుమానం
  • జూన్‌లో ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి

ముస్సోరిలోని లాల్ బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్ఎన్ఏఏ)లో పనిచేసే 22 ఏళ్ల యువకుడి ఆత్మహత్య సంచలనమైంది. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌కు చెందిన అనుకూల్ రావత్‌గా గుర్తించారు. చీర ధరించి, బొట్టు పెట్టుకుని, లిప్‌స్టిప్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

ఈ ప్రతిష్ఠాత్మక అకాడమీలో రావత్ ఇటీవలే మల్టీ టాస్కింగ్ స్టాఫర్‌గా చేరాడు. అయితే, విధులకు సరిగా హాజరయ్యేవాడు కాదు. తాజాగా, మరోమారు విధులకు డుమ్మా కొట్టడంతో అతడి కోసం రూముకు వెళ్లిన సహచరులు తలుపు తట్టారు. ఎన్నిసార్లు కొట్టినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బలవంతంగా తలుపులు తెరిచారు. చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని, పెదవులకు లిప్‌స్టిక్ పెట్టుకున్న రావత్ అనంతరం ఉరివేసుకున్నట్టు గుర్తించారు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

రావత్ బహుశా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. ఆత్మహత్యకు ముందు చీర ధరించి, మేకప్ వేసుకోవడం అతడి మానసిక స్థితిని తెలియజేస్తోందని పోలీసులు తెలిపారు.

కాగా, ఇలాంటి ఘటనే ఈ ఏడాది జూన్‌లో ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ ఆశిష్ చౌశాలి ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కూడా మేకప్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

  • Loading...

More Telugu News