Amaravati Works: రాజధాని అమరావతి పనులను నేడు పునఃప్రారంభించనున్న చంద్రబాబు

CM Chandrababu to restart Amaravati works today

  • వైసీపీ హయాంలో ఆగిపోయిన అమరావతి పనులు
  • ఈ ఉదయం 11 గంటలకు అమరావతి పనులకు శ్రీకారం చుట్టనున్న చంద్రబాబు
  • ఈ నెల 16న సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

ఆగిపోయిన రాజధాని అమరావతి పనులకు ఏపీ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టబోతోంది. అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పునఃప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 160 కోట్లతో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఆ పనులను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. 

ఈ నెల 16న జరిగిన సీఆర్డీఏ సమావేశంలో అమరావతి పనుల పునఃప్రారంభంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూములు, ప్రస్తుత అమరావతి పరిస్థితి సహా మొత్తం 12 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో భూమి పొందిన వారు మళ్లీ పనులను కొనసాగించే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ఎలాంటి విద్యా సంస్థలను ఆహ్వానించాలి? అనే అంశంపై చర్చించారు. అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చే వారికే భూముల కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. టాప్ 10 కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రచించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను మళ్లీ వెనక్కి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని ఆదేశించారు. రూ. 160 కోట్లతో 2,42,481 చదరపు అడుగుల్లో సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణానికి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈరోజు అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News