Nara Lokesh: పరువునష్టం కేసు గెలుస్తామని ఆశిస్తున్నా: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh talks to media after court trial in Vizag

  • సాక్షి మీడియాపై లోకేశ్ పరువునష్టం కేసు
  • నేడు విశాఖ కోర్టుకు హాజరైన లోకేశ్
  • విచారణ అనంతరం మీడియా సమావేశం

సాక్షి మీడియాపై పరువునష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ ఇవాళ విశాఖ కోర్టులో హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. పరువునష్టం కేసు గెలుస్తామని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇంత జరిగినా బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. సాక్షి మీడియాపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

తనపై ఒక్క ఆరోపణను కూడా సాక్షి మీడియా నిరూపించలేకపోయిందని అన్నారు. తాను ఎక్కడా ప్రజాధనాన్ని వృథా చేయలేదని, ఇకనైనా సాక్షి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని లోకేశ్ హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సాక్షి యజమానిని హెచ్చరిస్తున్నా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా జగన్ పైనా లోకేశ్ ధ్వజమెత్తారు. "జగన్ చేసిన లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే లిక్కర్ స్కాంలో ఉన్న అందరిపైనా చర్యలు ఉంటాయి. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే వారిపై చర్యలు ఉంటాయి... జగన్ ఎందుకు కంగారు పడుతున్నాడు?" అని ప్రశ్నించారు. ఇక, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?

ఎర్ర బుక్కు చూస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారు? ఏ అధికారులు, వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పాను, దానికే నేను కట్టుబడి ఉన్నాను.నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నాను, నేను పాదయాత్ర చేస్తుంటే జీవో 1 తెచ్చి అడ్డుకోవాలని చూశారు.

గతంలో టీడీపీ తరపున వాదించిన అడ్వొకేట్లపై కూడా దాడులు చేశారు, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2019లో బ్లూ మీడియా సాక్షి విశాఖ ఎడిషన్ లో నాపై ఫేక్ న్యూస్ పబ్లిష్ చేసింది. దానిపై నేను 75కోట్లకు పరువునష్టం దావా వేశాను. వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. 

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనం గానీ, వసతి వినియోగించలేదు. ఫ్లయిట్ టిక్కెట్లు కూడా నేనే కొనుక్కుంటున్నాను. ప్రజాజీవితంలో మేం బాధ్యతగా మెలిగే వాళ్లం. మూడోసారి విశాఖకు వచ్చాను. నేను పాదయాత్రలో వాడిన బస్సులోనే విశాఖ పార్టీ కార్యాలయంలో బసచేస్తున్నా.

క్యాలండర్ ప్రకారమే సూపర్–6 పథకాల అమలు!

సూపర్ సిక్స్ పథకాల అమలుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ పథకాల అమలుకు మా వద్ద క్యాలండర్ ఉంది. దాని ప్రకారమే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ముందుకు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి పెన్షన్ సొమ్ము పెంచి ఇస్తున్నాం. అన్నాక్యాంటీన్లు ప్రారంభించాం. 

నిరుద్యోగులకు మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాం. విద్యావ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నాం. వివిధ సామాజికవర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం పలు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. జగన్ మాదిరి కల్లబొల్లి కబుర్లు చెప్పం. గత ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు ఏమయ్యాయి? నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్టు కాదు.

మద్యం ఎంఆర్ పి ధరలకు అమ్మాల్సిందే!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మద్యం షాపుల్లో ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయించాలి. షాపులు ప్రారంభించి రెండురోజులే అయింది. పకడ్బందీగా విజిలెన్స్ ఏర్పాటు చేసి, ఎంఆర్ పి అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో అక్రమ మధ్యంపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

రుషికొండపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కడు ఉండటానికి రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎన్జీటీ రూ.200 కోట్లు ఫైన్ వేసింది. ఒక వ్యక్తి బతకడానికి ఇంత సొమ్ము ఖర్చు చేయడం అవసరమా? ఈ డబ్బుతో లక్షలమంది గూడులేని పేదలకు ఇళ్లు లభించేవి. 

రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలనే విషయమై ఆలోచించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు దానిని జాగ్రత్తగా పరిరక్షించాల్సి ఉంది. అందుకోసం ప్యాలెస్ చుట్టూ ఉన్న రెండు రోడ్లలో ఒకటి మూసివేసి ఉంచారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రెండో రహదారిని ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తాం.

నవంబర్ – డిసెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్!

నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. విశాఖలో ప్రీహోల్డింగ్ భూములపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక రెవిన్యూ మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నెలరోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. 

ఉచిత ఇసుక విధానంలో లోపాలను సరిచేస్తాం. 2019లో ఏధరకు ఇసుక లభించిందో అదే ధరకు ఇసుక లభ్యమయ్యేలా చూస్తాం. యూనివర్సిటీల్లో కొత్త  వీసీల నియామకానికి సెర్చ్ కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. వీసీల నియామకం పూర్తిచేశాక ఆయా యూనివర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తాం. 

  • Loading...

More Telugu News