Jagan: న్యాయం గెలిచిందంట... మరి వీటి సంగతేంటి?: చంద్రబాబుపై జగన్ విమర్శనాస్త్రాలు

Jagan take a dig at CM Chandrababu over Skill Development Case

  • తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశం
  • ఇటీవల స్కిల్ కేసులో ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
  • చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ టీడీపీ ట్వీట్
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జగన్ 
  • చంద్రబాబుకు, టీడీపీకి, కొన్ని మీడియా సంస్థలకు ప్రశ్నల వర్షం

వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పైనా, తెలుగుదేశం పార్టీ పైనా, కొన్ని మీడియా సంస్థల పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఇటీవల ఈడీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కొందరి ఆస్తులు అటాచ్ చేయగా... న్యాయం గెలిచిందంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీనిపై జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

"నిజం నిలిచిందంట... న్యాయం గెలిచిందంట... స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమ కేసు పెట్టిన జగన్ కి చెంపపెట్టులా, చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆ ట్వీట్ లో రాసుకున్నారు. నిజంగా ఏమైనా బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? మనుషులను ఏమనుకుంటున్నాడు? మనుషులకు చదువు రాదనుకుంటాడా? మనుషులు చదవలేరనుకుంటాడా? మనుషులకు అసలేమీ తెలియదనుకుంటాడా? 

ఎంత ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సామ్రాజ్యం ఆయనకు ఉంటే మాత్రం, ఎంతగా గోబెల్స్ ప్రచారం చేయగలనన్న అతి విశ్వాసం ఆయనకు ఉంటే మాత్రం... ఈ మాదిరిగా వక్రీకరించడం అన్నది ఎవరు చేయగలుగుతారు? 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తే, దీనికి సమాధానం ఏంటంటే చెప్పడు. సోషల్ మీడియాలో మాత్రం తనకు నచ్చినట్టుగా రాసుకుంటాడు... దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వత్తాసు పలుకుతాయి. చంద్రబాబు ఎందుకు ఈ విధంగా అబద్ధాలకు రెక్కలు కడుతున్నాడు? 

అసలు ఈడీ ప్రెస్ నోట్ లో ఎక్కడైనా క్లీన్ చిట్ అనే ప్రస్తావన ఉందా? సుమన్ బోస్, వికాస్ ఖాన్విల్కర్ లకు డబ్బులు ఎక్కడ్నించి వెళ్లాయి? వీళ్లకు ఈ డబ్బులు ఎవరిచ్చారు? నాడు చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? ఆ డబ్బులు మాకు ముట్టలేదు అని సీమెన్స్ కంపెనీయే చెప్పిన మాట వాస్తవం కాదా? తమకు ఎలాంటి డబ్బులు ముట్టలేదని జర్మనీకి చెందిన సీమెన్స్ ఒరిజినల్ కంపెనీ నోయిడాలోని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడం వాస్తవం కాదా? 

ఆ డబ్బు పుణే నుంచి హైదరాబాద్ వెళ్లినట్టు సీమెన్స్ సంస్థ అంతర్గత విచారణలో వెల్లడి కాలేదా? ఇలా బయటికి వెళ్లిన డబ్బులను దారిమళ్లించిన మాట వాస్తవం కాదా? అలా బయటికి వెళ్లిన సొమ్ము తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? రాబోయే రోజుల్లో చంద్రబాబును, ఆయన పీఎస్ శ్రీనివాస్ ను ఈడీ అరెస్ట్ చేయదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోవడం అంటే ఇది కాదా? 

తాము చంద్రబాబు ఆదేశాల మేరకు డబ్బు విడుదల చేశామని ఇద్దరు ఐఏఎస్ అధికారులు 164 సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు... ఇది వాస్తవం కాదా? మరి, కళ్లెదుటే ఇవన్నీ కనిపిస్తుంటే చంద్రబాబు ఏమంటున్నాడు... నిజం నిలిచింది... న్యాయం గెలిచిందంట!" అంటూ జగన్ తూర్పారబట్టారు.

  • Loading...

More Telugu News