Canada: కెనడా ఆరోపణలపై భారత్ కౌంటర్ అటాక్

india rejects trudeaus allegations says canada has provided no evidence in nijjar killing

  • లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ వ్యక్తులను అప్పగించాలని కోరుతున్నా కెనడా నుండి స్పందన లేదన్న భారత్
  • ఆ ముఠాపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శ 
  • భారత వ్యతిరేక చర్యలను కెనడా ప్రోత్సహిస్తోందన్న విదేశాంగ శాఖ 

కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ కౌంటర్ ఇచ్చింది. కెనడాపైనే ఆరోపణలు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులను సరెండర్ చేయాలని అనేక మార్లు కోరినా కెనడా నుంచి ఎటువంటి స్పందన రాలేదని భారత్ పేర్కొంది. ఆ ముఠాపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని స్పష్టం చేసింది. ట్రూడో ప్రభుత్వం తీరు, నిరాధార ఆరోపణల వల్లే తాజా సంక్షోభం ఏర్పడిందని తెలిపింది.  

తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయాలని కెనడాకు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా భారత్ ఆందోళనలను వారు పట్టించుకోవడం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆయన అన్నారు. నేరస్థుల అప్పగింత కేసులకు సంబంధించి ఇప్పటి వరకూ 26 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 
 
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని గతేడాది నుంచి కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. విచారణ కమిషన్ ముందు ఈ విషయాన్ని ట్రూడో అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా మళ్లీ భారత్‌పై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. భారత్ దౌత్యవేత్తలపై కెనడా చేసిన ఆరోపణలను మరోసారి ఆయన ఖండించారు. భారత వ్యతిరేక చర్యలను కెనడా ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు.   

  • Loading...

More Telugu News