Virat Kohli: బెంగ‌ళూరు టెస్టులో డ‌కౌట్‌తో చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్న కోహ్లీ

Virat Kohli Equals Embarrassing Record With 9 Ball Duck Against New Zealand

  • బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ తొలి టెస్టు
  • డ‌కౌట్‌ల‌లో విరాట్ కోహ్లీ చెత్త రికార్డు
  • అత్య‌ధిక సార్లు (38) డ‌కౌట్ అయిన క్రికెట‌ర్‌గా టిమ్ సౌథీతో స‌మంగా కోహ్లీ

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ర‌న్‌మెషిన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. త‌ద్వారా ఓ చెత్త రికార్డును న‌మోదు చేశాడు. 

వ‌ర్త‌మాన క్రికెట‌ర్ల‌లో అంత‌ర్జాతీయ స్థాయిలో అత్య‌ధిక సార్లు (38) డ‌కౌట్ అయిన క్రికెట‌ర్‌గా విరాట్ నిలిచాడు. ఈ అవాంఛిత రికార్డు జాబితాలో కోహ్లీతో స‌మంగా న్యూజిలాండ్ ఆట‌గాడు టిమ్ సౌథీ ఉండ‌గా... ఆ త‌ర్వాతి స్థానంలో రోహిత్ శ‌ర్మ (33) ఉన్నాడు. 

ఇక బెంగ‌ళూరు టెస్టులో మొద‌టి రోజు వ‌ర్షార్ప‌ణం కాగా, రెండో రోజు అయిన గురువారం మొద‌ట టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మెడ నొప్పి కార‌ణంగా త‌ప్పుకున్న శుభ్‌మ‌న్ గిల్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ జ‌ట్టులోకి రాగా, పేస‌ర్ ఆకాశ్ దీప్ స్థానంలో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

కాగా, మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు ఈ నెల 24-28 మ‌ధ్య పూణేలో జ‌ర‌గ‌నుంది. అలాగే మూడో టెస్టు న‌వంబ‌ర్ 1-5 మ‌ధ్య ముంబ‌యిలో జ‌ర‌గ‌నుంది.   

బెంగ‌ళూరు టెస్టుకు తుది జ‌ట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఓ రూర్కే.

  • Loading...

More Telugu News