Ben Duckett: టెస్టు క్రికెట్‌లో బెన్ డకెట్ ప్ర‌పంచ రికార్డు.. గిల్‌క్రిస్ట్, సెహ్వాగ్‌ల రికార్డు బ్రేక్‌!

Ben Duckett Surpasses Adam Gilchrist and Virender Sehwag To Shatter Sensational World Record

  • ముల్తాన్ వేదిక‌గా పాక్‌, ఇంగ్లండ్ మ‌ధ్య‌ రెండో టెస్టు
  • టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల ప‌రుగులు బాదిన ఇంగ్లండ్ క్రికెట‌ర్‌
  • కేవ‌లం 2,293 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకున్న డ‌కెట్‌
  • ఇంతకుముందు ఈ రికార్డు టిమ్ సౌథీ (2,418 బంతులు) పేరిట

పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న‌ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. టిమ్ సౌథీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్‌లను అధిగమించి ఈ సంచలన రికార్డును న‌మోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. 2,293 బంతుల్లోనే అత‌డు ఈ మార్క్‌ను అందుకోవ‌డం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెట‌ర్ టిమ్ సౌథీ (2,418 బంతులు) పేరిట ఉండేది. అత‌ని త‌ర్వాతి స్థానంలో వ‌రుస‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2,483 బంతులు), వీరేంద్ర సెహ్వాగ్ (2,759 బంతులు), రిషభ్‌ పంత్ (2,797 బంతులు) ఉన్నారు. 

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆట‌గాళ్లు
2,293 బంతులు - బెన్ డకెట్
2,418 బంతులు - టిమ్ సౌథీ
2,483 బంతులు - ఆడమ్ గిల్‌క్రిస్ట్
2,759 బంతులు - వీరేంద్ర సెహ్వాగ్
2,797 బంతులు - రిషభ్‌ పంత్


ఇక ముల్తాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ టెస్టులో బుధ‌వారం రెండోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 239 ప‌రుగులు చేసింది. అంత‌కుముందు ఆతిథ్య పాకిస్థాన్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 366 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ప్ర‌స్తుతం ఇంగ్లీష్ జ‌ట్టు ఇంకా 127 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.  

కాగా, డ‌కెట్ అద్భుత‌మైన సెంచ‌రీ (114)తో రాణించ‌డంతో ఇంగ్లండ్‌ రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 211 ప‌రుగుల‌తో ప‌ట్టుబిగించిన‌ట్లే క‌నిపించింది. కానీ, పాక్ బౌల‌ర్లు సాజిద్ (4-86), నోమన్ (2-75) విజృంభించ‌డంతో 14 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే 4 వికెట్లు కోల్పోయింది. 

ఇక ఇప్ప‌టికే తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News