Flash Floods: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు

Flash floods alert for some districts in AP

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • నెల్లూరుకు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు దూసుకువస్తోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 280 కిలోమీటర్లు, నెల్లూరుకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, పెన్నా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

ఇప్పటికే సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News